3 June, 2026 | 4:12 AM

నిమ్స్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

03-06-2026 12:41 AM

పంజాగుట్ట,జూన్ 2(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన వేడుకల సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు నిమ్స్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు నిమ్స్ నుంచే బలపడ్డాయన్నారు.

ఉద్యమ సమయంలో ఇక్కడి విద్యార్థులు, ప్రజల పోరాట స్ఫూర్తి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించడంలో చారిత్రాత్మక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, అడ్మినిస్ట్రేషన్ హెచ్‌ఓడి లక్ష్మీ భాస్కర్, డాక్టర్ గంగాధర్, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, అలైడ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులుతో పాటు వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సింగ్, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.