ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ ధర్నా ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన పార్టీ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నా నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుసరించాల్సిన సంప్రదాయాలకు విరుద్ధమైన చర్యగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఒక ప్రకటన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో, చట్టబద్ధమైన వేదికలపై, రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా ప్రస్తావించడం ప్రతిపక్షం యొక్క బాధ్యతనీ తెలిపారు.
అయితే, ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ నిరసనలు నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణం కాదన్నారు. ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపకుండా, రాజకీయ ప్రచారం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష వైఖరి కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించడం, రాజ్యాంగబద్ధమైన విధానాలను పాటించడం ప్రతి ప్రజాప్రతినిధి యొక్క బాధ్యతనీ వివరించారు.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధమైన, శాంతియుతమైన ప్రజాస్వామ్య పద్ధతులను సమర్థిస్తుందనీ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు. ఇట్టి అప్రజాస్వామిక చర్య ను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ర్యాలీ ని అడ్డుకోవడమే కాకుండా మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావుతో సహా బీజేపీ నాయకులు కాయకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నామని తెలిపారు.
ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని తెలిపారు. నీట్ అంశం పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పినప్పటికి కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ కుటిల నీతికి నిదర్శనమని తెలిపారు.






