8 August, 2026 | 12:49 PM

కాలానికి చెల్లింపు!

20-07-2026 12:00 AM

ప్రతి ఉదయం కాలం నాకోసం

ఒక రోజును నిశ్శబ్దంగా జమచేస్తుంది

ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో

ఆ లెక్కను ఎప్పుడూ చెప్పదు

ఆ రోజు నుంచి కొన్ని గంటలను

సంపాదనకు వెచ్చిస్తాను

కొన్ని గంటలను చదువుకు వెచ్చిస్తాను

మరికొన్ని గంటలను

అనుభూతులతో నింపుకొంటాను

కొన్ని గంటలను

ప్రేమలో దాచుకుంటాను

కొన్ని గంటలను

కుటుంబంతో పంచుకుంటాను

కొన్ని గంటలను

స్నేహాలపై ఖర్చు చేస్తాను

ప్రణాళికలు రచిస్తూ

రేపటి కోసం పెట్టుబడి పెడతాను

మరికొన్ని గంటలను

ఆందోళనలకు అప్పగిస్తాను

చివరికి మాత్రం నన్నే కోల్పోతాను

డబ్బు పెరుగుతుంది

వస్తువులు పెరుగుతాయి

కానీ నాలో--రోజులు తగ్గిపోతాయి

పుస్తకాలు పెరుగుతాయి

జ్ఞానం పెరుగుతుంది

కాలం మాత్రం తన వడ్డీని

ప్రతి రోజూ వసూలు చేస్తూనే ఉంటుంది.

పిల్లలు ఎదుగుతారు

కలలు మారిపోతాయి

నేను మాత్రం నెమ్మదిగా

వెనుకడుగు అవుతాను

మనసు మాత్రం

మరో తీరాన్ని పిలుస్తుంది

శరీరం మాత్రం

అడుగులను లెక్కిస్తుంది

శ్వాస కూడా

విరామాలు అడుగుతుంది

కోరికలు మాత్రం

రేపటినే నమ్ముతాయి

నేను రోజులను

ఖర్చు చేస్తున్నాననుకున్నాను

నిజానికి రోజులే

నన్ను ఖర్చు చేశాయి

నేను జీవితాన్ని

అనుభవిస్తున్నాననుకున్నాను

కాలమే నన్ను చదివింది

నేను కాలంతో

ప్రయాణిస్తున్నాననుకున్నాను

కాలమే నాలోంచి ప్రయాణించింది

ఒక ఉదయం

కాలం నిశ్శబ్దంగా

జమ చేయడం ఆపేస్తుంది

ఉదయం మాత్రం

ఎప్పటిలాగే ఉదయిస్తుంది

గడియారం కూడా

కాలం లెక్కలను

నమోదు చేస్తూనే ఉంటుంది

కాలం మాత్రం

తన లెక్కల పుస్తకంలో

నా వంతు లెక్కను పూర్తి చేస్తుంది

తీసుకున్న ప్రతి రోజుకీ

ఇదే తుది చెల్లింపు

ఒక రోజు---.. నా ఖాతాను మూసివేస్తాను

లెక్క ముగుస్తుంది

ప్రయాణం కాదు

అది వీడ్కోలు కాదు

నా వంతు పూర్తయింది !!

బొల్లిముంత వెంకటరమణారావు