22 July, 2026 | 10:38 PM

జంతర్ మంతర్ ఘటనపై మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

22-07-2026 09:20 PM

ఆలేరు,(విజయక్రాంతి): బీజేపీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినందుకు ప్రధాని మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆలేరు పట్టణంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన దీక్ష, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, తాజా నీట్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. ఈ అనిశ్చితితో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.