17 March, 2026 | 1:03 AM

ఎమ్మెల్యే ఆఫీస్ పక్కనే అక్రమ కట్టడాలా?

17-03-2026 12:00 AM
  1. డిఫెన్స్ నిబంధనలు గాలికేనా..?
  2. ఆర్‌సీఐ రోడ్డులో ఐదు అంతస్తులకు అనుమతి ఎవరిచ్చారు?
  3. అధికారులు వస్తారు.. పోతారు.. మేమే రాజులం..
  4. సిబ్బంది బరితెగింపునకు అడ్డుకట్ట ఎప్పుడు..?
  5. మీర్‌పేట్‌లో ప్లానర్లుగా మారిన సిబ్బంది

బడంగ్‌పేట్, మార్చి 16 (విజయక్రాంతి) : అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్, జిల్లెలగూడ ప్రాంతాలు మారుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో సాగుతున్న అక్రమ అంతస్తుల  నిర్మాణాలు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. గత పదేళ్లుగా పాతుకుపోయిన కొందరు సిబ్బంది, వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణాల కు రూ. 10 లక్షల ప్యాకేజీ.. అంతా వారే చూసుకుంటారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏళ్లుగా తిష్టవేసిన కొందరు సిబ్బంది, ఇప్పుడు ఏకంగా ’ప్లానర్ల’ అవతారమెత్తారు. ‘మాకు ఇంత ఇస్తే చాలు.. పర్మిషన్ నుంచి ప్లాన్ వరకు, స్లాబ్ నుంచి ఫినిషింగ్ వరకు అధికారులెవ్వరూ రాకుండా మేము చూసుకుంటాం‘ అంటూ బహిరంగంగానే డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో భవనానికి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తూ, చట్టవిరుద్ధ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

డిఫెన్స్ నిబంధనలు గాలికే..

ఆర్.సి.ఐ  నిబంధనల ప్రకారం రోడ్డుకు ఇరువైపులా 150 మీటర్ల వరకు ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం గ్రౌండ్ ప్లస్ వన్ అంతస్తుకే అనుమతి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.గరిష్టంగా ఒక అంతస్తు మాత్రమే నిబంధన ఉంది. సెల్లార్తో పాటు ఐదు అంతస్తుల వరకు భారీ భవనాలు నిర్మించడం గమనార్హం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇంత అక్రమం జరుగుతున్నా, సర్కిల్ డీసీ మరియు ఉన్నతాధికారులు కళ్లున్నా చూడలేని స్థితిలో ఉన్నారా? అంటూ స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బంది ఆగడాలు.. బెదిరింపులే పెట్టుబడి!

కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారని తెలిస్తే చాలు, ఈ ’ముఠా’ అక్కడ వాలిపోతుంది. పై అధికారులు పంపించా రు.. అనుమతులు లేవు.. ఆఫీసుకి రావాలి అంటూసామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఏళ్లుగా ఒకే సెక్షన్లో ఉండటంతో అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. ఇక్కడ మేమే రాజులం, మేమే మంత్రులం‘ అనే ధీమా వారిలో కనిపిస్తోంది.

స్థానికుల డిమాండ్..

‘అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందిం చి, ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న సిబ్బందిపై విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట పడకపోతే, మీర్పేట్ ప్రాంతం భవిష్యత్తులో కాంక్రీట్ అడవిగా మారి సామాన్యులకు నరకాన్ని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.