వృద్ధుడి అదృశ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నగర్ నివాసి అయిన ఎస్కే మౌలానా (82) అనే వృద్ధుడు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి సంతోష్ నగర్ లో నివసిస్తున్నారు. అయితే, ఈ నెల 11వ తేదీన బయటకు వెళ్లిన మౌలానా ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. తండ్రి ఎంతకీ కానరాకపోవడంతో బాధితుడి కుమార్తెలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ ఓ తెలిపారు.






