3 July, 2026 | 1:25 AM

చదువే భవిష్యత్తుకు బలమైన పునాది

03-07-2026 12:32 AM

జనగామ టౌన్, జూలై 2 (విజయక్రాంతి): విద్యార్థి భవిష్యత్తుకు చదువే పునాది అని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం పాలకుర్తి కేజీబీవీలో విద్యా ప్రమాణాలు, వసతులు, పారిశుద్ధ్యంపై సమగ్ర తనిఖీ నిర్వహించారు.

కలెక్టర్ విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించి, వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రతి విద్యార్థి స్పష్టంగా చదవగలిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ కష్టపడి చదివి, తల్లిదండ్రులకు అండగా నిలవాలని, చదువే భవిష్యత్తుకు ఆధారం అని ప్రోత్సహించారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ తనిఖీ

పాలకుర్తిలో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను కలెక్టర్ తనిఖీ చేశారు. బీ ఎల్ వో లు క్షేత్రస్థాయిలో యాప్ ద్వారా వివరాలు నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమగ్రంగా వివరాలను పూరించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి నిర్దేశిత గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.