కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్
- ఎమ్మెల్యే సిద్ధరామయ్య ప్రతిపదించగా.. బలపరిచిన మరో ఎమ్మెల్యే పరమేశ్వర
- వెంటనే మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- ౩న సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం
బెంగళూరు, మే ౩౦: కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన సౌధలో ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఎన్నుకున్నారు. డీకేను సీఎల్పీ నేతగా మొదట ఎమ్మెల్యే సిద్ధరామయ్య ప్రతిపాదించగా, మరో ఎమ్మెల్యే పరమేశ్వర ఆ ప్రతిపాదనను బలపరిచారు. వెంటనే మిగతా ఎమ్మెల్యేలంతా చేతులెత్తి ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే డీకే శివకుమార్, సిద్ధరామయ్య కలిసి లోక్‌భవన్ (రాజ్‌భవన్)కు వెళ్లారు. అసెంబ్లీలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమ్మతించాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కోరారు. గవర్నర్ అందుకు సమ్మతించడంతో సీఎంగా డీకే ప్రమాణ స్వీకారోత్సవానికీ ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల ౩న లోక్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, ఆయన మంత్రివర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం ధ్రువీకరించారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ప్రకారం డీకే సుమారు రెండేళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు
డీకే శివకుమార్ తన ౧౮ ఏటనే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐలో విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 83 మధ్య పార్టీ బెంగళూరు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో సాథనూర్ నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నాటి సీఎం ఎస్.బంగారప్ప మంత్రివర్గంలో పిన్న వయస్కుడిగా జైళ్ల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ క్రమంలో ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్ అనే పేరు తెచ్చుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు. ౩న ముఖ్యమంత్రి పీఠాన్నీ అధిష్ఠించనున్నారు. ఒకవైపు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు తన కుటుంబ సభ్యుల సహకారంతో క్వారీయింగ్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపార రంగాల్లోనూ రాణించారు. ట్రస్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మసీ సంస్థలు, పాఠశాలలు నడిపిస్తున్నారు.
తద్వారా రాష్ట్ర రాజకీయ నేతల్లోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. డీకేకు కాస్ట్లీ వాచీలంటే ఎంతో ఇష్టం. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, డీకే ఆస్తుల విలువ నికరంగా రూ.1,413.80 కోట్లు. వాటిలో స్థిరాస్తులు రూ. 1,140 కోట్లు కాగా, చరాస్తులు రూ.273 కోట్లు. అలాగే, అప్పులు రూ.265 కోట్లు.






