25 March, 2026 | 9:49 AM

Breaking News

ఎస్బీఐ పేరుతో సైబర్ మోసం

25-03-2026 12:44 AM

రైతు ఖాతాలో రూ.61 వేలు మాయం

కుమ్రం భీమ్ జిల్లా సోనాపూర్‌లో ఘటన 

వాంకిడి, మార్చి 24 (విజయ క్రాంతి): కుమ్రం భీమ్ జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన రైతు పంద్రం చంద్రు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని రూ.61 వేల రూపాయలు కోల్పోయాడు. వివరాలు..వారం పది రోజుల క్రితం ఒక వాట్సాప్ గ్రూప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో వచ్చిన లింక్‌ను అతడు నమ్మి క్లిక్ చేశాడు. అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ.61 వేల రూపాయలు ఒక్కసారిగా మాయమయ్యాయి.

కొన్ని రోజు ల తర్వాత ఖాతాను పరిశీలించిన బాధితుడు డబ్బులు లేవని గుర్తించి బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది ఇది సైబర్ మోసం కావచ్చని సూచించడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవలి కాలంలో బ్యాంకుల పేరుతో ఫిషింగ్ లింకులు పంపిస్తూ ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా ఉండాలని, బ్యాంకింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని ప్రజలకు సూచించారు.