19 March, 2026 | 7:17 PM

కృష్ణా జలాలు అందక ఎండుతున్న పంటలు

18-03-2026 12:00 AM

మరో నెల రోజులు నీళ్లు ఇస్తే చేతికి రానున్న పంటలు 

కల్వకుర్తి మార్చ్ 17 : కేఎల్‌ఐ కాల్వల ద్వారా సాగునీరు నిలిచిపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో రైతులు సాగు చేసిన మొ క్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు అరకొర నీరు మాత్రమే అందడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాలు సమృద్ధిగా అందుతాయని ఆశతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు రెండో పంటగా మొక్కజొన్న, వరి సాగు చేశారు.

ముఖ్యంగా కాలువలపై ఆధారపడి సాగు చేసిన రైతులు ఎక్కువగా ఉండడంతో నీటి కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. మార్చి నెలాఖరులో గా కేఎల్‌ఐ కాల్వ ద్వారా నీరు వస్తుందని భా వించి భారీ స్థాయిలో మొక్కజొన్న సాగు చేపట్టారు.ప్రధానంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 29వ ప్యాకేజీ పరిధిలో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. జంగారెడ్డి పల్లి నుంచి మాడుగుల మండలం నాగిళ్ల వరకు డి 82 కాల్వ పై ఆధారపడి నూతనంగా పం టలు వేసుకున్నారు.

అయితే గత నెల రోజులుగా నీటి సరఫరా తగ్గిపోవడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయి.రెండు వారా ల క్రితం వరకు నీరు కొంతవరకు అందినా, ప్రస్తుతం నీళ్లు రాక కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రైతులు బోరుబావులపై ఆధారపడాల్సి వస్తోంది. నిరంతరం బోర్లు నడపడంతో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి.

 పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు

వేల రూపాయల పెట్టుబడులు పెట్టి చేతికొచ్చే దశలో పంటలు పడుతున్నాడంతో రైతులు పడడానికి పాట్లు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అదనపు పెట్టుబడులు పెడుతున్నారు. కొత్తగా బోరుబావులు తవ్వడం, కిలోమీటర్ల మేర పైపులు వేయడం వంటి పనులకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు.

కల్వకుర్తి డివిజన్లో సుమారు 3500 ఎకరాల్లో విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇందులో సుమారు సగభాగం కేవలం కే ఎల్ ఐ కాలులపై ఆధారపడే రైతులు ఉన్నా రు. అధికారులు వారబంధి పద్ధతిలోనైనా నీటి సరఫరా చేస్తే కొంతవరకైనా బయటపడతామని రైతులు అంటున్నారు. మొక్కజొ న్న పంటకు ఇంకా ఒక నెలరోజులు నీరు అందిస్తే పంట నిలబడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.