4 September, 2026 | 5:32 PM

కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన

04-09-2026 | 04:41pm

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 

డిసిసి అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్

కామారెడ్డి,(విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు  రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఉత్తరాఖండ్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud)  ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా(Kamareddy district) కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్  నాయకత్వం వహించారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ కి మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల గౌరవం కోసం ప్రశ్నించిన రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు పాల్పడిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ పోరాటం ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల ఆత్మగౌరవం కోసం అని ఏలే మల్లికార్జున్  స్పష్టం చేశారు. కుల వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు “రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించాలి”, “కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి”, “రాజ్యాంగాన్ని కాపాడుదాం – సామాజిక న్యాయాన్ని సాధిద్దాం” అంటూ నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ భారీ నిరసన కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ , జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు , జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ , టిపిసిసి జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి , టౌన్ ప్రెసిడెంట్ ఐరేని సందీప్ కుమార్ లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్  నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌ల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.