3 July, 2026 | 1:30 AM

నిర్ణీత గడువు దాటినా అందని ధ్రువీకరణ పత్రాలు

03-07-2026 12:37 AM

ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో సేవల జాప్యంపై ప్రజల ఆగ్రహం

క్షేత్రస్థాయి విచారణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు

దళారులను ఆశ్రయించిన వారికే వేగంగా సేవలందుతున్నాయనే ఫిర్యాదులు

విద్యార్థులు, వితంతువులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో

సమగ్ర విచారణ జరిపి పారదర్శక సేవలు అందించాలని ప్రజల డిమాండ్

ఇల్లందు టౌన్, జూలై 2 (విజయక్రాంతి): ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత గడువులో సర్టిఫికెట్లు అందాల్సి ఉన్నప్పటికీ వారాలు గడుస్తున్నా దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా నిర్వహించాల్సిన క్షేత్రస్థాయి విచారణ కూడా సకాలంలో చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.

దీంతో విద్యార్థులు, ఉద్యోగార్థులు, వితంతువులు, వృద్ధులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు పట్టణానికి చెందిన ఓ వితంతు మహిళ వితంతు పెన్షన్ కోసం అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందేందుకు మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకుంది. నిర్ణీత గడువులో సర్టిఫికెట్ అందాల్సి ఉండగా నాలుగు వారాలు గడిచినా ఇప్పటికీ మంజూరు కాలేదని ఆమె వాపోయింది.

పలుమార్లు కార్యాలయానికి వెళ్లినా సరైన స్పందన లభించలేదని, కనీసం తన నివాసానికి వచ్చి క్షేత్రస్థాయి విచారణ కూడా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు దళారులను ఆశ్రయించిన వారి దరఖాస్తులు మాత్రం త్వరగా పరిష్కారమవుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, మధ్యవర్తుల ద్వారా వెళ్లిన ఫైళ్లకు ప్రాధాన్యం లభిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో దళారులకే అధికారులు మొక్కుచూపుతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం పారదర్శకంగా, నిర్ణీత గడువులో పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, జాప్యానికి కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి దరఖాస్తుదారుడికి ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా నిర్ణీత గడువులో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఇల్లందు పట్టణ ప్రజలు కోరుతున్నారు.