30 వరకు అసెంబ్లీ
- 20న బడ్జెట్
- నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ
- ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పర్వదినాల్లో సభకు సెలవు
- 23 నుంచి బడ్జెట్, పద్దులపై చర్చ.. 30న ఆమోదం!
- బీఏసీ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి): ఈ నెల 30 వరకు రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. 20న డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభగం కాగా, శాసనసభ, శాసన మండలి సభలనుద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసగించారు.
అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు, కేపీ వివేకానంద, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.
17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగా నికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఉంటుంది. 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రెండు రోజులు సభకు సెలవు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి 29 వరకు బడ్జెట్, పద్దులపై చర్చ జరనుంది. మార్చి 30న బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత సభ నిరవధికంగా వాయిదాపడనుంది.
31 వరకు నిర్వహించాలి: హరీశ్‌రావు
అసెంబ్లీ సమావేశాలు మార్చి 31 వరకు నిర్వహించాలని బీఆర్‌ఎస్ సభాపక్ష ఉప నేత హరీశ్‌రావు బీఏసీలో ప్రభుత్వాన్ని కోరారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పర్వదినాలు మినహా మిగతా అన్ని రోజులు సభ ను నడపాలని సభ్యులు విజ్ఞప్తిచేశారు. ఆదివారాలు కూడా సభను కొనసాగించాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కోరారు.
అసెంబ్లీ సమావేశాలు మార్చి 30 వరకు నిర్వహిస్తే.. అందు లో ఐదు సెలవులు ఉన్నాయని, ఆరేడు పనిదినాలు కూడా ఉండవని సభ్యు లు అభిప్రా యపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి చెబుతామని మంత్రులు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుపడుతున్నారని, ప్రధాన ప్రతిప క్షానికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్ నేతలు కోరారు.
సభ్యులందరికి మాట్లాడే అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా స్పీకర్ చెప్పారు. కాగా, పక్షం రోజులపాటు సాగే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, మూసీ ప్రక్షాళణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశాలపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.




