యునెస్కో కీర్తి కిరీటంపై 'కానుకల' మరక

23-11-2026 | 10:54am

- దేవుడి సొమ్ముకు దిక్కెవరు?

- భక్తుల కానుకలపై ఎవరి పెత్తనం?

- గర్భగుడిలోనే నగదు పోగు!

- భక్తుల కానుకల సేకరణపై అనుమానాలు

వెంకటాపూర్,(విజయక్రాంతి): కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలోని కాటేశ్వర ఆలయంలో భక్తుల కానుకల సేకరణ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఆలయంలో అధికారికంగా హుండీ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు గర్భగుడి ఇనుప గేటు బయట నుంచే స్వామివారికి నాణేలు, కరెన్సీ నోట్లు సమర్పిస్తున్నారు. దీంతో గర్భగుడిలో నగదు పేరుకుపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కానుకలను ఎవరు సేకరిస్తున్నారు? వాటి లెక్కలు ఎక్కడ నమోదు చేస్తున్నారు? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి.

హుండీకి అనుమతి లేదా?

పురావస్తు శాఖ నిబంధనల కారణంగా కాటేశ్వర ఆలయంలో అధికారిక హుండీ ఏర్పాటు చేయడం లేదన్న ప్రచారం ఉంది. మరోవైపు భక్తులు నేరుగా గర్భగుడిలోకి నగదు వేస్తుండటంతో కానుకల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ఏర్పాటు సాధ్యం కాకపోతే భక్తుల కానుకల సేకరణకు ప్రత్యామ్నాయ పారదర్శక విధానం ఎందుకు అమలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వారానికోసారి నగదు సేకరణ?

గర్భగుడి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారని, వారానికోసారి తాళం తీసి లోపల పేరుకుపోయిన నగదును సిబ్బంది సేకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా సేకరించిన నగదు ఎంత? ఏ ఖాతాలో జమ చేస్తున్నారు? ఆదాయానికి సంబంధించి రికార్డులు నిర్వహిస్తున్నారా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

సమగ్ర విచారణ జరపాలి

ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప క్షేత్రంలో భక్తుల కానుకల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవడం ఆందోళన కలిగిస్తోంది. పురావస్తు శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు స్పందించి కాటేశ్వర ఆలయంలో కానుకల సేకరణపై సమగ్ర విచారణ జరపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఇప్పటివరకు సేకరించిన నగదు వివరాలు, రికార్డులను పరిశీలించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా కానుకల సేకరణలో పారదర్శకత పాటించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు