ఇందిరమ్మ జీవిత బీమాపై ప్రజలకు అవగాహన
శ్రీహరి రాజు ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ
అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం చేరాలనే లక్ష్యం
శ్రీరంగాపురం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డిచర్ల శ్రీహరి రాజు ఆధ్వర్యంలో శ్రీరంగాపురం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పథకానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు, అర్హతలపై వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీహరి రాజు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే జీవిత బీమా పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరాలు చేరవేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విష్ణు, టౌన్ అధ్యక్షులు గోవిందు, ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్ నాయకులు రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.