బిస్లరీ వాటర్‌పై FSSAI షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన నీటి శాంపిల్‌లో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంలో బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది. FSSAI వెల్లడించిన వివరాల ప్రకారం.. కంపెనీ ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌ను తొలుత పరీక్షించగా, అనుమతించిన పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ శాంపిల్‌ను అసురక్షితమైనదిగా ప్రకటించారు.
ఈ నివేదికపై కంపెనీ అప్పీల్ చేయడంతో మరోసారి రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఈసారి శాంపిల్‌లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించారు. వీటిలోని కొన్ని రసాయన సమ్మేళనాలు క్యాన్సర్ ముప్పుతో సంబంధం కలిగి ఉంటాయి. దీంతో రెండో పరీక్షలోనూ శాంపిల్ అసురక్షితమైనదిగా నిర్ధారణ అయింది.
కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి
రెండు దశల ప్రయోగశాల పరీక్షల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద బిస్లరీ సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు FSSAI అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ పరీక్షల వివరాలు ఒక నిర్దిష్ట శాంపిల్‌కు సంబంధించినవే. దేశవ్యాప్తంగా విక్రయించే బిస్లరీ ఉత్పత్తులన్నీ కలుషితమైనవని దీని అర్థం కాదు. ఈ పరిణామం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి చర్చకు దారితీసింది.