వైఎస్ షర్మిలకు షాక్

23-11-2026 | 09:18am

బెంగళూరు: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(AP Congress President YS Sharmila)కు బెంగళూరులో అనూహ్య పరిణామం ఎదురైంది. యలహంక(Yelahanka)లోని కుటుంబ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఆదివారం బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్రాస్ సమీపంలో షర్మిల ప్రయాణిస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అక్కడి నుంచి యలహంక వైపు వెళ్లేందుకు అనుమతించలేదు. సంబంధిత కోర్టు ఉత్తర్వులను పోలీసులు చూపించడంతో ఆమె వెనుదిరిగినట్లు డీసీపీ జీకే మిథున్ కుమార్(DCP GK Mithun Kumar) తెలిపారు. అయితే తన నివాసానికి వెళ్లడంలో తప్పేముందని షర్మిల ప్రశ్నించినట్లు ఏపీసీసీ వెల్లడించింది.

ఈ పరిణామానికి కారణం యలహంకలోని ఆస్తిపై కొనసాగుతున్న వివాదమే. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నవంబర్ 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి తమ ఆధీనంలో ఉందని, అందులో షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు లేదా వారి తరఫున వ్యవహరించే వ్యక్తులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సంస్థ కోర్టును ఆశ్రయించింది.

లీజు ఒప్పందం ప్రకారం ఆస్తి తమ స్వాధీనంలో ఉందని సిలికాన్ బిల్డర్స్ వాదించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ వ్యవహారం షర్మిల, ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న కుటుంబ ఆస్తి వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఇదిలా ఉండగా, తన కుమార్తె వివాహ వేడుకలను యలహంక నివాసంలో నిర్వహించాలని షర్మిల గతంలో భావించగా, భద్రతా కారణాలను చూపుతూ జగన్ అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ఏపీ రాజకీయ, కుటుంబ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు