స్వగ్రామానికి సాయితేజ మృతదేహం
నల్గొండ: ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలో మంచి ఉద్యోగం సాధించాడన్న ఆనందం ఆ కుటుంబంలో ఎంతోకాలం నిలవలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. చివరకు అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన ఈరమళ్ల సాయితేజ(Nalgonda Sai Teja) మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సాయితేజ ఇటీవలే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించాడు.
కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో ఈనెల 18న న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) అతడి ప్రాణాలను బలిగొంది. న్యూయార్క్(New York)లోని ఇంటర్‌స్టేట్-90 హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో సాయితేజ కారు అకస్మాత్తుగా అడ్డువచ్చిన జింకను ఢీకొట్టింది. దీంతో వాహనం రహదారిపై నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కార్గో వ్యాన్ ఆ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో రెండు వాహనాలు కూడా ప్రమాదానికి గురయ్యాయి. తీవ్రంగా గాయపడిన సాయితేజను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు.
వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన కుమారుడు త్వరలో జీవితంలో స్థిరపడతాడని ఆశించిన తల్లిదండ్రులకు ఈ వార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా అమెరికా నుంచి సాయితేజ భౌతికకాయం నల్గొండ(Nalgonda)లోని స్వగృహానికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.