కరీంనగర్లో నేడు నితిన్ నబీన్ పర్యటన
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్ కేంద్రంగా బీజేపీ భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్లో నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు నితిన్ నబీన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వైశ్య భవన్‌కు వెళ్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో పాల్గొంటారు.
ఈ పాదయాత్ర రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రి రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు కొనసాగనుంది. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పు నృత్యాలతో నితిన్ నబీన్‌కు స్వాగతం పలకనున్నారు.
'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యమని పార్టీ పేర్కొంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో నితిన్ నబీన్ తిరిగి బయలుదేరి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.