శారీరక శ్రమతోనే సంపూర్ణ ఆరోగ్యం
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): శారీరక శ్రమతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ(Bhupalpally Municipality) పరిధిలోని అంబేద్కర్ స్టేడియం, జయశంకర్ పార్కులలో సోమవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి గండ్ర, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి రామస్వామి నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వాకింగ్ చేశారు.
ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి యువతను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ ఆపైర్స్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రస్తుత యువత ఎక్కువ సమయం సెల్ఫోన్లకే కేటాయిస్తూ శారీరక వ్యాయామానికి దూరమవుతున్నారని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నిన్న హనుమకొండలో పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమేనని అన్నారు.
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మాటలతో ఎదురుదాడి చేస్తూ, విమర్శలు, తిట్లకే పాలనను పరిమితం చేశారని అన్నారు. ప్రభుత్వానికి మిగిలిన 500 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైందని నిన్న కేటీఆర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.