సమ్మిట్ సవాల్

23-11-2026 | 05:20am

పెట్టుబడుల అమలే సర్కారుకు అసలు పరీక్ష

  1. ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు
  2. మరోవైపు కంపెనీల విశ్వాసంపై సందేహాలు
  3. గత సమ్మిట్ ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవెన్ని?
  4. త్వరలో జరిగే సమ్మిట్ ముందుకు రానున్న ప్రశ్నలు
  5. తాజాగా ఓ కంపెనీ కార్యాలయంపై దాడితో మరింత చర్చ
  6. హైదరాబాద్ ప్రతిష్టను కాపాడుకోవడమే అత్యంత కీలకం

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు(International investments) ప్రధాన గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌లకు (State Government Global Summit) పెద్దపీట వేస్తున్నది. తెలంగాణ రైజింగ్ పేరుతో 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్దేశించు కున్నది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వె స్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కూడా ఈ లక్ష్యాలకు వేదిక కానుంది.

అయితే ఈ భారీ లక్ష్యాలు, పెట్టుబడుల ప్రకటనల మధ్య ఇప్పుడు ఒక కీలక ప్రశ్న తెరపైకి వస్తున్నది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తున్నాయి? అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్‌పై ఉన్న విశ్వాసాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నది? అనేది చర్చనీయాంశంగా మారింది. 

పెట్టుబడుల ఆకర్షణలో ప్రచారం ఎంత ముఖ్యమో, వాటి అమలులో విశ్వసనీయత అంతకంటే అవసరం. గ్లోబల్ సమ్మిట్‌లలో వేల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులపై ఆసక్తి ఉందనే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

పెట్టుబడులు వచ్చాయని చెప్పడానికి ఒప్పందాలు మాత్రమే ప్రామాణికం కాదు. భూముల కేటాయింపు, అనుమతులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఉత్పత్తి ప్రారంభం, ఉద్యోగాల కల్పన వరకు ప్రక్రియ పూర్తయినప్పుడే ఆ పెట్టుబడి వాస్తవ రూపం దాలుస్తుంది. గతంలో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో కుదిరిన అవగాహన ఒప్పందాల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదని తెలుస్తున్నది. కొన్ని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో రాబో యే సమ్మిట్‌లో కొత్త ఒప్పందాల సంఖ్యను ప్రకటించడంతోపాటు గతంలో కుదిరిన ఒప్పందాల పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ప్రాజెక్టులకు భూములు కేటాయించారు? ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి? ఎంత పెట్టుబడి వాస్తవంగా వచ్చింది? ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ప్రతిష్టను కాపాడటం..!

హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపుపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఐటీ రంగంలో నగరం సంపాదించుకున్న పేరు ఒక్కరోజులో వచ్చింది కాదు. గత ప్రభుత్వాల పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అంతర్జాతీయ సంస్థలకు కల్పించిన అనుకూల వాతావరణం ఈ గుర్తింపునకు పునాదులుగా నిలిచాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కీలక కార్యకలాపాల కేంద్రంగా ఎంచుకోవడం నగర ప్రతిష్ఠను మరింత పెంచింది.

ఇప్పుడు ఈ బ్రాండ్‌ను కాపాడుకోవడం, మరింత విస్తరించడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద బాధ్యతగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో మెటా కార్యాలయంపై జరిగిన దాడి ఘటన ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ సంస్థ కార్యాలయంపై దాడి జరగడం, దానిపై రాజకీయ వివాదాలు చెలరేగడం పెట్టుబడిదారుల్లో ఆందోళనలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

ఒక సంస్థతో ఏవైనా వివాదాలు ఉన్నా వాటిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. సంస్థల కార్యాలయాలు, ఉద్యోగులు, ఆస్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే పెట్టుబడిదారులు ఒక నగరాన్ని ఎంచుకునేటప్పుడు కేవలం రాయితీలు, భూములు, మౌలిక సదుపాయాలనే కాకుండా అక్కడి శాంతిభద్రతలు, రాజకీయ వాతావరణం, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వాన్ని కూడా పరిశీలిస్తారని నిపుణులు చెప్తున్నారు 

కంపెనీల విశ్వాసం కీలకం!

ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ రంగం సంప్రదాయ సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకే పరిమితం కాలేదు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ నగరం కీలక కేంద్రంగా ఎదుగుతున్నది. ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి. ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేలా ప్రోత్సహించాలి.

కొత్త కంపెనీలు రావడానికి అనుకూల వాతావరణం కల్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అనుమతుల్లో వేగం, భూము ల కేటాయింపులో స్పష్టత, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, రవాణా సదుపాయాలు, ఉద్యోగుల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయంగా ఒక పార్టీ అధికారంలో ఉండటం, మరో పార్టీ ప్రతిపక్షంలో ఉండటం సహజం. కానీ.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశా లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి.

గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పరిశ్రమలను కొనసాగించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించ డం, ఇప్పటికే ఉన్న సంస్థలకు భరోసా కల్పించడం ప్రభుత్వాల నిరంతర బాధ్యతగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాల్లో అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడిదారుల్లో సందేహాలు పెరుగుతాయని.. పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఎంతో అవసరమని చెప్తున్నారు.

ప్రత్యేక పర్యవేక్షణ అవసరం..

తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రస్తుతం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. పెట్టుబడుల ఆకర్షణకు గ్లోబల్ సమ్మిట్‌ల నిర్వహణ, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు పెంచుకోవడం, కొత్త రంగాల్లో అవకాశాలను అన్వేషించడం కీలకమే. అయితే ఈ కార్యక్రమాలు కేవలం ప్రచార వేదికలుగా మిగిలిపోకూడదు. గతంలో కుదిరిన ఒప్పందాల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. పెట్టుబడుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడించాలి.

ప్రతి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాలపరిమితి విధించి, అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలి. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం ఐటీ కంపెనీల విస్తరణ మాత్రమే కాదు. దానికి అనుబంధంగా హోటళ్లు, రవాణా, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్య రంగాలు, చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. స్థానిక యువతకు అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆదాయం సమకూరుతుంది.

అందుకే బ్రాండ్ హైదరాబాద్‌పై వచ్చే ప్రతి ప్రతికూల సంకేతాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. మొత్తంగా చూస్తే తెలంగాణకు గ్లోబల్ సమ్మిట్‌లు ఒక అవకాశమైతే.. వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావడం అసలైన సవాల్. ఒకవైపు ప్రపంచానికి పెట్టుబడుల ఆహ్వానం పలుకుతూ..

మరోవైపు రాష్ట్రంలో వ్యాపార సంస్థలకు భద్రత, నమ్మకం, స్థిరత్వం కల్పించాలి. కొత్త ఒప్పందాలు ఎన్ని కుదిరాయన్న దానికంటే ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి?.. అన్నదే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాలని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లలో చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమవుతాయి.. కానీ పెట్టుబడిదారుల విశ్వాసం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనే హైదరాబాద్ బ్రాండ్‌ను అంతర్జాతీయంగా నిలబెడతాయని చెప్తున్నారు.

 

మరిన్ని వార్తలు