శూర్పణఖగా రకుల్.. ఆ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్ ‘రామాయణ’ (Ramayana) సినిమాలో శూర్పణఖ పాత్ర పోషించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని తెలిపింది. ప్రతిష్ఠాత్మక ఇతిహాస కథలో భాగం కావడం గర్వంగా ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
ఎన్నో తరాలుగా భారతీయుల జీవితాల్లో భాగమైన రామాయణం వంటి గొప్ప ఇతిహాసంలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని రకుల్ తెలిపింది. ఈ కథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం అద్భుతమైన అనుభూతి అని పేర్కొంది. భారతీయురాలిగా ఈ సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నానని తన పోస్ట్‌లో వెల్లడించింది.
మరో ఇంటర్వ్యూలో శూర్పణఖ పాత్ర (Shurpanakha Character) గురించి రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పాత్రలో అనేక విభిన్న కోణాలు ఉంటాయని, ఇప్పటివరకు చాలామంది ఆమెను ఒకే కోణంలో చూసి తప్పుగా అర్థం చేసుకున్నారని అభిప్రాయపడింది. శూర్పణఖ పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఈ సినిమాతో లభించిందని తెలిపింది. దీంతో ‘రామాయణ’లో రకుల్ పోషించనున్న పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.