నివాస ప్రాంతంలో అక్రమంగా టపాసుల నిల్వ.. ఇద్దరి అరెస్ట్
భద్రతా ప్రమాణాలు పాటించకుండా 100 కిలోల బాణసంచా నిల్వ.. మేడిపల్లి పోలీసుల స్వాధీనం
మేడిపల్లి,(విజయక్రాంతి): నివాస ప్రాంతంలో ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండా భారీ మొత్తంలో టపాసులను నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 100 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచవాని సింగారం, జయశంకర్ విగ్రహం సమీపంలోని నివాస ప్రాంతంలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినట్లు గురువారం ఉదయం 8 గంటలకు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
పోలీసులు, సిబ్బంది, సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా వివిధ రకాల టపాసులను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మొత్తం 58 పెట్టెలు, ఇతర ప్యాకెట్లలో ఉన్న సుమారు 100 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏలగందుల స్వామి (31), తండ్రి వెంకటేష్, వృత్తి బార్బర్, కాచవాని సింగారం, జయశంకర్ విగ్రహం సమీప నివాసి; జక్కుల శ్రీనివాస్ (36), తండ్రి మల్లేష్, వృత్తి డ్రైవర్, ఉప్పల్లోని దేవేందర్ నగర్ కాలనీ నివాసి, ఇంటి నంబర్ C1/108లను పోలీసులు గుర్తించి విచారించారు.
తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా టపాసులను నిల్వ ఉంచినట్లు విచారణలో వెల్లడైన నేపథ్యంలో పంచనామా నిర్వహించి బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుమారు 9:30 గంటలకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న టపాసులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మేడిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా బాణసంచాను నిల్వ ఉంచడం, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అగ్నిప్రమాదాలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. టపాసుల నిల్వ, విక్రయాలకు సంబంధించి చట్టబద్ధమైన అనుమతులు పొందడంతోపాటు నిర్దేశిత భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇలాంటి అక్రమ నిల్వలు లేదా ప్రమాదకర కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.