మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు

29-10-2026 | 05:57pm

550 ఎకరాలకు పైగా భూముల వివాదంలో కీలక తీర్పు

ప్రైవేటు వ్యక్తుల అప్పీళ్లు కొట్టివేత

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని మియాపూర్ భూముల వివాదం(Miyapur land dispute)లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కీలక విజయం లభించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాలకు పైగా భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ అప్పీళ్లపై సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది.

2003 నాటి తీర్పునే సవాల్ చేస్తూ పిటిషన్లు

మియాపూర్ భూములకు సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని 2003లో ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పార్ధసారధి, సువిశాల్ జైన్ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధమైన వారసుల నుంచి భూములను పొందామని, తమకు ఉన్న ఇర్రివొకబుల్ GPA, సనద్ హక్కులను పరిరక్షించాలని వారు వాదించారు. రిజిస్టర్డ్ పత్రాలను రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున కీలక వాదనలు

ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ వాదనలను వ్యతిరేకించారు. సంబంధిత భూములకు గతంలోనే పరిహారం చెల్లించినందున, వారసులుగా చెప్పుకుంటున్న వ్యక్తులకు వాటిపై హక్కులు కోరే అవకాశం లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.

వందల ఎకరాల ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యం

భారీ విలువ కలిగిన ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలకు ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. 550 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం కీలక పరిణామంగా నిలిచింది. మియాపూర్ ప్రాంతంలో భూముల విలువ అధికంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ భూముల హక్కులు, పాత రిజిస్ట్రేషన్లు, GPA పత్రాల చెల్లుబాటు వంటి అంశాలపై ఈ కేసు ప్రత్యేక ప్రాధాన్యం పొందింది.

మరిన్ని వార్తలు