కాపర్ వైర్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్

29-10-2026 | 11:27pm

3 కరెంట్ మోటార్లు, ఆటో స్వాధీనం

కరీంనగర్ క్రైం, అక్టోబర్ 29(విజయక్రాంతి):  కరీంనగర్ రూరల్ , కొత్తపల్లి ,మానకొండూరు మండలం గ్రామాల్లో  కరెంట్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కరెంట్ మోటార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు  సాయికుమార్(28), వజీద్ పాషా(24)లు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.  ఇద్దరూ కలిసి రాత్రి సమయాల్లో ఆటోలో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను, వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంట్ మోటార్లను దొంగిలించేవారు.

అనంతరం వాటిని గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి, వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేసేవారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా కరెంట్ మోటార్ల దొంగతనాలు జరుగుతుండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు  అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం  అంగీకరించారు. వీరిపై కరీంనగర్ రూరల్, కొత్తపల్లి,  మానకొండూరు  పోలీస్ స్టేషన్లలో మొత్తం 8 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్టు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు