బాలికలకు టోల్‌ఫ్రీ నంబర్లతో కూడిన జ్యూట్ బ్యాగుల పంపిణీ

29-10-2026 | 11:32pm

బోధన్,(విజయక్రాంతి): బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం(Beti Bachao-Beti Padhao program)లో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రాజెక్టు పరిధిలోని ఆమ్దపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Amdapur High School)లో బాలికలకు టోల్‌ఫ్రీ నంబర్లతో కూడిన జ్యూట్ బ్యాగులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ సీడీపీఓ నందిని, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గోపిలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్నలు తమ చేతుల మీదుగా బాలికలకు జ్యూట్ బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా సీడీపీఓ నందిని మాట్లాడుతూ.. ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడం, లింగ నిష్పత్తిని మెరుగుపరచడం, బాలికల పట్ల వివక్షను తొలగించడం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. సమాజంలో బాలికల పట్ల సమానత్వ భావనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టోల్‌ఫ్రీ నంబర్లతో కూడిన పర్యావరణహిత జ్యూట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. బ్యాగులపై ముద్రించిన టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా బాలికలు అవసరమైన సందర్భాల్లో సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు