సాంకేతికకు వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం
ఇంజనీరింగ్ రీ-డిజైన్ పేరుతో ప్రజలపై లక్ష కోట్ల భారం మోపిన బీఆర్ఎస్ నాయకులకు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదు.
మేడిగడ్డ పై సైకిల్ యాత్ర తో రైతులను మోసం చేసే ప్రయత్నం.
జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ కోట రాజబాబు
భూపాలపల్లి,/మహాదేవపూర్,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను ఇంజనీరింగ్ రీ-డిజైన్ పేరుతో నిర్మించి, ఇంజనీరింగ్ సాంకేతికకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కింది నుండి పైకి తీసుకెళ్లే ఎత్తిపోతల పథకాన్ని కట్టి తెలంగాణ ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం మోపిన బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక విలువ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని భూపాలపల్లి(Bhupalpally) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మహాదేవపూర్ పిఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, మహాదేవపూర్ మండల అధ్యక్షుడు కట్కం అశోక్ అన్నారు.
గురువారం మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లున్నాయని, ఆ నీళ్లను ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ రైతాంగానికి అందించడం లేదని, ప్రాజెక్టు ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కొరకంటి చందర్ మంథని, రామగుండం నియోజకవర్గాలకు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల రైతాంగానికి ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా డిజైన్ చేసిన ప్రాజెక్టుకు మద్దతు పలికి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఈ రెండు జిల్లాల ప్రజలు, రైతులు అర్థం చేసుకుంటారన్నారు. వారికి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిపై ఆకాంక్ష లేదన్నారు.
వారి నాయకుడు జ్ఞాని అని చెబుతున్నారని, ఆయన జ్ఞాని గనుకనే కొండపోచమ్మ ద్వారా తన ఫామ్‌హౌస్‌కు కెనాల్ ద్వారా డైరెక్ట్‌గా నీళ్లు తీసుకెళ్లారని, మరి ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళితే మిమ్మల్ని నమ్మి ఓటేసిన ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు నీళ్లు ఇవ్వలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయాయని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి ప్రాజెక్టును చూడడానికి వెళితే పోలీసులను పెట్టి అడ్డుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. పిల్లర్లు కుంగినప్పుడు అధికారంలో ఉండి ఎందుకు రిపేర్ చేయించలేదని నిలదీశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు తెలంగాణ ఇస్తే, రీ-డిజైన్ పేరుతో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టి సాంకేతిక లోపంతో ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని ప్రచారం చేసుకున్నారని, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్యాముల నిర్మాణంలో సాంకేతిక లోపంపై ప్రపంచ ఇరిగేషన్ నిపుణులు, ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పరిశీలన చేయించామని, వారు మూడు ప్రాజెక్టులను సందర్శించి నీళ్లు నింపొద్దు, నింపితే కూలిపోతాయని, లక్షలాది మందికి ప్రాణనష్టం జరుగుతుందని ఆదేశించడంతో ప్రభుత్వం గేట్లు ఎత్తివేసిందని తెలిపారు.
ప్రాజెక్టు సరిగ్గానే ఉందని నిరూపించుకోవాలంటే ఢిల్లీ వెళ్లి ఎన్ డి ఎస్ ఏ, ను సంప్రదించవచ్చు కదా, అది కూలిపోతుందని తెలిసే మీరు వెళ్లడం లేదన్నారు. రామగుండం, మంథని ప్రాంతంలో బ్యాక్ వాటర్ వల్ల మునిగిన రైతులకు కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదని, నిజంగా రైతులపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంథనికి నీళ్లు ఎందుకు తీసుకురాలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన చేస్తున్నారని, డ్యాముల విషయంలో 2027 జూన్-జూలై వరకు సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఎ సలహా మేరకు, ఆర్మీకి చెందిన కల్నల్ నేతృత్వంలో కమిటీ వేసి టెస్టింగులు జరుగుతున్నాయి.
రిపోర్టు వచ్చాక పునర్నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పదేపదే చెబుతున్నారని అన్నారు.ప్రజలను మభ్యపెట్టేందుకు తాము ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం ప్రాజెక్టు రిపేరు చేస్తున్నారనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లడం భావ్యం కాదన్నారు. మరోసారి ప్రభుత్వంపై, తమ ప్రియతమ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శివ, అస్రార్, తుంగల శ్రీజ సంతోష్, వామన్ రావు, ఆకుతోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.