టిజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు

29-10-2026 | 11:21pm

9 ఆహార తయారీ కేంద్రాల లైసెన్సు సస్పెన్షన్, వ్యాపారాల నిలిపివేత

హనుమకొండ,(విజయక్రాంతి): టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి(TG Safe Commissioner Avinash Mohanty) ఆదేశాల మేరకు, వరంగల్,హనుమకొండ జిల్లా పరిధిలోని పలు మిఠాయి తయారీ కేంద్రాలు ఆయిల్ మిల్లులు, ముడి పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లపై ఆహార పరిరక్షణ అధికారులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో మొత్తం 10 ప్రత్యేక బృందాలు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.

ఈ తనిఖీల్లో భాగంగా హన్మకొండ, వరంగల్ పరిధిలోని పలు ప్రముఖ ఆహార తయారీ కేంద్రాలలో, స్పైసెస్ తయారీ కేంద్రాలు, కొన్ని ఆయిల్ మిల్లుల తయారీ కేంద్రాలు, మిఠాయి తయారీ కేంద్రాలు, అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలు,  సోంపు తయారీ,  ఐస్ క్రీమ్ తయారీ  కేంద్రాల మీద ఏక కాలంలో దాడులు చేశారు. తయారీ కేంద్రాలలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు, నాణ్యతా లోపాలు మరియు అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్న సదరు సంస్థలపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ, లైసెన్స్ సస్పెండ్ చేస్తూ పలు యూనిట్లను మూసివేయడం జరిగింది. ఈ తనిఖీ ల్లో ఆహారంలో నిషేధిత పదార్థాల వాడకం,స్వీట్ల తయారీలో ఫ్లేవర్ కోసం ముఖానికి రాసుకునే 'ఫేషియల్ రోజ్ వాటర్'ను వాడుతుండటం అధికారులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. కుళ్ళిన, గడువు ముగిసిన ముడి పదార్థాలు చిప్స్ తయారీ కోసం నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన బంగాళాదుంపలు, బూజు పట్టిన అల్లం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గడువు ఉన్న వాటితో కలిపి ఉంచడం కనుగొన్నారు.

ఒక సోంపు తయారీ కేంద్రంలో 5045 కిలోల ఐదు లక్షల 41 వేల వందల యాభై రూపాయల విలువ గల లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన సరైనటువంటి చిరునామా వాటి వివరాలు ముద్రించకుండా అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులను సీజ్ చేశారు.అనంతరం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  జ్యోతిర్మయి మాట్లాడుతూ... ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమని  తెలిపారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి, స్పైసెస్ తయారీ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఆహార పరిరక్షణ లైసెన్స్లను ప్రముఖంగా ప్రదర్శించాలని, నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడులలో వరంగల్ జిల్లా, హనుమకొండ,భూపాలపల్లి,ములుగు, జనగాం, నల్గొండ, సూర్యాపేట,  యాదాద్రి భువనగిరి జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ లతో పాటు పోలీస్ సిబ్బంది 30 మంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు