కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య
మల్లాపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్ స్టేషన్(Mallapur Police Station) పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బింగిసారపు శివ(23) కడుపునొప్పితో బాధపడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. గత ఏడాది కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్దపేగుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
అయినప్పటికీ తరచూ కడుపునొప్పి రావడంతో తీవ్రంగా బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తోట నుంచి ఇంటికి వచ్చిన శివ ఇంట్లోని రేకుల షెడ్డు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే శివ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి బింగిసారపు సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్లాపూర్ ఎస్‌ఐ ఏ. అనిల్ తెలిపారు.