రైతాంగ మహోన్నత నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి మూడ్ శోభన్
చేగుంట,(విజయక్రాంతి): రైతాంగ హక్కుల కోసం, అన్నదాతల సంక్షేమం కోసం తన జీవితాన్నే ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి(Comrade Sarampalli Mallareddy) మరణం మొత్తం వ్యవసాయ రంగానికి, రైతు ఉద్యమానికి తీరని లోటని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక చేగుంట పట్టణంలోని ఇన్స్పెక్టర్ బంగ్లా (ఐబీ)లో తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers Association) జిల్లా అధ్యక్షుడు మద్ది లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ జరిగింది. మల్లారెడ్డి పోరాట పటిమను, రైతు రక్షణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా శోభన్ మాట్లాడుతూ మల్లారెడ్డి... స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం, సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర కేటాయింపుల కోసం, విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కోసం ఆయన ధర్నాలు, ముట్టడులు మాత్రమే కాదు... సుదీర్ఘమైన అధ్యయనంతో కూడిన పోరాటాలు చేశారుఅని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మద్ది లక్ష్మీ నరసయ్య, సిఐటియూ జిల్లా అధ్యక్షులు బాలమణి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అయిత దివాకర్, మహమ్మద్ రఫీ, బోయిని నర్సింహులు, జిల్లా సహాయ కార్యదర్శులు సీహెచ్ లచ్చ గౌడ్, భాస్కర్, భిక్యా నాయక్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.