ముగిసిన రాష్ట్రస్థాయి యోగా పోటీలు
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో జరిగిన 17వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా పోటీల ముగింపు కార్యక్రమానికి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ యోగాతో పాటు మిగతా క్రీడలో రాణించి తెలంగాణను ఒకటవ స్థానంలో నిలపాలన్నారు. యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పరిచయం అయిందని రానున్న ప్రపంచ స్థాయి యోగా పోటీల్లో భారతదేశానికి తిరుగు లేదన్నారు. విద్యార్థి దశ నుంచి కేవలం పాఠ్యాంశాల కే పరిమితం కాకుండా క్రీడల్లో భాగస్వాములు అయితే రిజర్వేషన్ ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ప్రత్యేకించి సీబీఎస్ఈ లో అదనపు సబ్జెక్టుగా యోగాను ఎంపిక చేసుకునే అవకాశము ఉందన్నారు.చదువులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రస్థాయి పోటీలకు ఆల్ ఫోర్స్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ యోగాకు చిరునామాగా కరీంనగర్ నిలవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి(Telangana State Yoga Association President SN Reddy) మాట్లాడుతూ స్వల్ప వ్యవధిలో ఘనంగా రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించిన కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ ను ఆయన అభినందించారు.
తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. సిద్ధా రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వెయ్యి మంది క్రీడాకారుల తో చక్కటి యోగా పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. వరుసగా 17వ సారి కరీంనగర్ ఛాంపియన్ గా నిలవడం ఇక్కడి క్రీడా ప్రతిభకు నిదర్శనం అన్నారు.అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథులు ట్రోఫీలతో పాటు వ్యక్తిగత మెడల్స్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.