డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె

06-11-2026 | 08:37pm

రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ఆశా వర్కర్స్ యూనియన్(ASHA Workers Union)(సీఐటీయూ, బీఆర్‌టీయూ) నాయకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య సేవలు అందించడం, ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడటంతోపాటు తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సీజనల్, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణతోపాటు కరోనా సమయంలోనూ విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఫిక్స్‌డ్ వేతనం లేదని, ప్రస్తుతం నెలకు రూ.9,900 మాత్రమే పారితోషికం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదేళ్లుగా పారితోషికాలు పెంచకపోవడంతో పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఐటీయూ, బీఆర్‌టీయూ నాయకులు సమ్మక్క, వాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమస్యలు పరిష్కరించకపోవడంతో పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్ 22(1) ప్రకారం సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల ప్రయోజనం కల్పించాలని కోరారు. పారితోషికంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలని, ఆదివారాలు, పండుగలకు సెలవులతోపాటు ఏడాదికి 20 రోజుల సాధారణ సెలవులు, ఆరు నెలల వేతనంతో కూడిన వైద్య సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పదోన్నతులు కల్పించాలని, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఆశా వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సరోజ, సుజాత, శోభ, పద్మ, సత్యవతి, వెంకటలక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు