పంటలు వద్దన్న సీఎం అధికారంలో ఉండొద్దు
- ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా హామీలను విస్మరించిన రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్లో సిద్దిపేట బాబు.. సిరిసిల్ల బాబుల మధ్య తర్జనభర్జన
- నాగోబా దీవెనతో ఇక్కడి నుంచే తొలి జెండా ఎగురవేస్తాం
- ఇంద్రవెల్లి పంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్/ఉట్నూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులు పంటలు వెయ్యొద్దన్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని, అలాంటి వ్యక్తి సీఎం పదవిలో ఎందుకు ఉన్నారని, పదవిని వదిలేయాలని, రైతులకు నష్టపరిహారం ఏం ఇస్తారో చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడవి బిడ్డలను మోసం చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో చేపట్టిన పాంచజన్య సంకల్ప సభలో పాల్గొనేందుకు ఆమె శుక్రవారం జిల్లాకు వచ్చారు. ముందుగా ముత్నూర్‌లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఇంద్రవెల్లి స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం సభలో ప్రజల ఉద్దేశించి కవిత మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ఇంద్రవెల్లి పోరుగడ్డపై దళిత దండోరా పేరుతో సభ నిర్వహించి, అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి వీరులకు రూ.25 లక్షలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి వారిని పట్టించుకోలేదని, కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. జిల్లాను దత్తత తీసుకున్నట్టు ప్రకటించడంతోపాటు ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లాకు వస్తానని చెప్పి, మూడేండ్ల ఏళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారని గుర్తుచేశారు.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో గల 750 గ్రామాల్లో కనీసం చదువుకునేందుకు పాఠశాలలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్ అభివృద్ధిలో 25 స్థానంలో ఉందని, కుమ్రం భీం జిల్లా 27 స్థానంలో ఉందని తెలిపారు. టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తే ప్రతి విద్యార్థికి ఉచిత విద్యతోపాటు ఉచిత వైద్యం అందిస్తామనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యువతకు ఉపాధి సౌకర్యం కోసం రెండు కోట్ల రూపాయలు రుణాలు అందిస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ది గర్జన కాదు తర్జనభర్జన సభ
బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ పెడుతోందని, వాళ్లది గర్జన కాదు.. తర్జనభర్జన సభ అని కవిత ఎద్దేవాచేశారు. సిద్దిపేట బాబు సభ పెట్టుకొని సిరిసిల్ల బాబును పిలవలేదంట, అందుకే సిరిసిల్ల బాబు ఆదిలాబాద్ గర్జనకు సిద్దిపేట బాబును పిలవడం లేదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట బాబుల మధ్య నెలకొన్న పంచాయితీతో ఆ పార్టీ కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పాలని అప్పుడే జిల్లాకు రావాలని డిమాండ్‌చేశారు.
జిల్లాలో చేపట్టిన చనాక-కోరాట బరాజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.368 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కోట్ల రూపాయలు గతంలో పని చేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, హరీశ్‌రావు ఇళ్లలోకి వెళ్లాయా? లేక బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయా చెప్పాలని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పదేళ్లు పని చేసిన కేటీఆర్ ఆదిలాబాద్‌లో మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీ, కాగజ్‌నగర్‌లోని పేపర్ మిల్లు, నిజామాబాద్‌లోని షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేక పోయారని ప్రశ్నించారు.
వెనుకబడిన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేసీఆర్ హామీ ఇచ్చారని, మరి ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జీవో 57ను పునరుద్ధరించి గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 1972లో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే తాము అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరించి ప్రభుత్వ పరంగా పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. నాగోబా దయతో తమ పార్టీ తొలి జెండా ఇక్కడి నుంచే ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈ జిల్లాలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్.. రేవంత్‌రెడ్డిపై ఈగ వాలనివ్వటం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో 80 లక్షల క్వింటాళ్ల పత్తి పండుతుందని, అయినా గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనీసం ఇక్కడ టెక్స్టైల్ పార్క్‌ను కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఆయన కారణంగా మంచిర్యాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. సభలో మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జిలు మెస్రం దయాకర్, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.