భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం
- ఉప్పొంగిన షింటాపు సరస్సు
- పశ్చిమ బంగాల్, అసోంలో అలర్ట్
- సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది
- పరిస్థితిని ఎదుర్కొనేందుకు రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్
థింపు/కోల్‌కతా/డీస్ఫూర్, అక్టోబర్ 30: భూటాన్(Bhutan)లో హిమానీనదం విస్ఫోటనం చెంది గాసా జిల్లాలో ఉన్న షింటాపు హిమానీ సరస్సు ఉప్పొంగింది. దీంతో 74లక్షల క్యూబిక్‌మీటర్ల నీరు కింద నదుల్లోకి ప్రవహిస్తుంది. దీంతో భారత్‌లోని పశ్చిమ బంగాల్ అలీపుర్దువార్, కూచ్ బెహార్ జిల్లాలోని సంకోష్ నది తీర ప్రాంతంలోని ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 12వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూటాన్‌లో కూడా నేపాల్ మాదిరే గురువారం రాత్రి మెరుపు వదరలు(Floods) సంభవించాయి.
దీని ప్రభావంతో షింటాపు నదికి గండిపడింది. దీంతో పునాఖా జిల్లాలో సౌర నీటిపారుదల ఎత్తిపోత వ్యవస్థ దెబ్బతింది. వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. పునాఖా రహదారిపై నీరు చేరింది. భారీగా చెత్తా చెదారం కొట్టుకువచ్చింది. దీంతో జోమ్లింగ్ తాంగ్ ప్రాంతంలోని రహదారిపై శిథిలాలు పేరుకుపోయాయి. లాయా గ్రామానికి వెళ్లే రహదారి ధ్వంసమై ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
మౌలిక సదుపాయాల కోసం నిర్మించిన పలు ప్రాజెక్టులు, రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భూటాన్ నుంచి నేరుగా ఈ వరద నీరంతా పశ్చిమ బంగాల్‌లోని అలీపుర్దువార్, జల్పాయిగురి, అసోంలోని ధుబ్రి నదిలోకి శుక్రవారం అర్థరాత్రికి చేరనుండడంతో భారత ప్రభుత్వం అలర్టయ్యింది. నేపాల్ తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో నదీ తీర ప్రాంతాల నుంచి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాగా హిమాలయాల్లోని 17 ప్రమాదకర హిమానీనద సరస్సుల్లో షింటాపు కూడా ఒకటి.