వైరల్ వీడియో: గాలికి కొట్టుకుపోయిన పెళ్లికూతురు
పెళ్లి ఫోటోషూట్‌లో ప్రాణాల మీదకు తెచ్చిన బెలూన్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లికి ముందు తీసుకునే Pre-Wedding Photoshootను అందంగా, ప్రత్యేకంగా రూపొందించుకోవాలని ఓ యువతి భావించింది. కానీ ఆ ఫోటోషూట్‌లో ఆమెకు ఎదురైన అనుభవం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా మారింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రసిద్ధ బోస్ఫరస్ జలసంధి సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం Social Mediaలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వధువు అందమైన దుస్తులు ధరించి, గోధుమ రంగు బెలూన్లను చేతిలో పట్టుకుని కెమెరాకు ఫోజులిస్తోంది. ఫోటోగ్రాఫర్ వివిధ కోణాల్లో చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో బెలూన్లు వేగంగా పైకి ఎగిరాయి. వాటిని పట్టుకున్న వధువు కూడా గాలి ధాటికి తన సమతుల్యతను కోల్పోయింది. నేలపై నిలబడలేక సమీపంలోని సముద్రపు గోడ వైపు కొట్టుకుపోవడంతో అక్కడ ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
క్షణాల్లో స్పందించిన ఫొటోగ్రాఫర్.. తప్పిన ప్రమాదం!
వధువు అదుపు తప్పి సముద్రం వైపు వెళ్లడాన్ని గమనించిన ఫొటోగ్రాఫర్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఆమెను పట్టుకుని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటన షూటింగ్ సమయంలో కెమెరాలో రికార్డైంది. అనంతరం ఆ వీడియో నెట్టింట్లోకి చేరడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో వధువుకు ఎలాంటి గాయాలు కాలేదు. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో ఆమె కొద్దిసేపు భయాందోళనకు గురైనా, తర్వాత తేరుకుని ఫోటోషూట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. అందమైన జ్ఞాపకంగా మిగలాల్సిన Pre-Wedding Shoot కాస్తా తృటిలో ప్రాణాపాయం తప్పిన ఘటనగా మారింది. ఈ వీడియో చూసిన పలువురు సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే సమయంలో ఫోటోషూట్లు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.