పోరు మరింత తీవ్రం
- జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాల్సిందే
- ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
- ఆ చెత్త వల్ల క్యాన్సర్‌తో ఎందరో చనిపోయారు
- చిన్న పిల్లలను కుక్కలు పీక్కుతింటున్నాయి
- రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ రెడీ చేస్తే.. కేంద్రం నుంచి నిధులు తెస్తా
- పనిలేక కాదు ప్రజా సమస్యలపై పోరాడేందుకే పాదయాత్ర
- డంపింగ్ యార్డ్ మాత్రమే కాదు రేవంత్ సర్కార్‌ను కూల్చేదాకా తిరుగుతానని హెచ్చరిక
- ముగిసిన ఈటల రాజేందర్ పాదయాత్ర
మేడ్చల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dump Yard) సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని, భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారుచేసి ఇస్తే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా చిన్నాపురంలో నిర్వహించిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. తాను పనిలేక పాదయాత్ర చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు ఉంచడంతోపాటు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడేందుకే చేపట్టానని ఈటల తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమంది క్యాన్సర్ తో మరణించారని, చిన్నపిల్లలను కుక్కలు పీక్కుతింటున్నాయని వాపోయారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు.
రేవంత్ సర్కార్‌ను కూల్చే వరకు తిరుగుతా
అంతకుముందు పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని పాదయాత్ర చేస్తుంటే ఈటల రాజేందర్ పని లేక తిరుగుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. డంపింగ్ యార్డే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా. ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని హెచ్చరించారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందో డీపీఆర్ ఇస్తే ప్రధానిని ఒప్పించి డబ్బులు తీసుకు వస్తానని, తీసుకురాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, రామారావు, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నేతలు విక్రమ్‌రెడ్డి, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్షంతో అంతరాయం
ఈటల రాజేందర్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షంలోనే ఉపన్యాసం కొనసాగింది. వర్షం వల్ల ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.
పాదయాత్ర విజయవంతం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర నాలుగు రోజులపాటు కొనసాగింది. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లభించింది. డంపింగ్ యార్డ్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఈటల రాజేందర్‌కు వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, సూర్యనారాయణ, రామారావు తదితరులు సంఘీభావం తెలిపారు.