మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం
- కోర్టు తీర్పు రాగానే అమ్ముతారా?
- రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారింది
- భూములను అనుచరులకు కట్టబెట్టే కుట్ర
- ఇంచు స్థలం పోయినా ఊరుకోం
- మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు..
- పేదల ఇళ్లు కూల్చొద్దు
- రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలి ఢిల్లీ పర్యటనలా?
- అమిత్‌షా రాకతో కాంగ్రెస్‌లో వణుకు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శలు
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కోర్టు తీర్పు వచ్చిందోలేదో మియా పూర్ భూములను వేలం వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవ్వడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(BJP State President N. Ramchander Rao) మండిపడ్డారు. ప్రజా ఆస్తులను తన అనుచరులకు కట్టబెడుతున్న ఈ ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలవాల్సింది పోయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తోందన్నారు. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ‘మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు.. కానీ, సుందరీకరణ పేరుతో పేదల పొట్టగొట్టడాన్ని ఒప్పుకోం’ అని పేర్కొన్నారు.
రాష్ర్టంలో ప్రజా సమస్యలను గాలి కొదిలేసి, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ అడుగుపెడుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డే వణుకు మొదలైనదన్నారు. శుక్రవారం బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు శాంతికుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓ.ఎస్. రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత విలువైన మియాపూర్ 550 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు తీర్పు ను బీజేపీ స్వాగతిస్తుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆగకుండా, భూములను వేలం వేసి అమ్మేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వేలం ముసుగులో భూములను అనుచరులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని, ఒక్క ఇంచు పోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మియాపూర్ భూములను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ బంధువులకు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.
కేంద్రంలోని తమ ప్రభుత్వ ప్రయత్నం, న్యాయవా దుల కృషి వల్లే నేడు 500 ఎకరాల భూము లు ప్రభుత్వానికి దక్కాయన్నారు. 500 ఎకరాల భూములను నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ బంధువులకు కట్టబెట్టాలని చూసిందని, అయితే ఆ భూ ములను రేవంత్‌రెడ్డి కాజేయాలనే ఉద్దేశంతో అప్పట్లోనే అమ్మకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ భూములను వేలం పేరుతో తమ అనుచరులకే కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నా రని మండిపడ్డారు. ప్రజా ఆస్తులను కొల్లగొట్టడంలో నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పరస్పరం పోటీపడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ దోపిడీని ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.
బాధితులను పిలువకుండా పబ్లిక్ హియరింగా?
మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ ప్రహసనంగా మారిందని రాంచందర్‌రావు విమర్శించారు. ప్రాజెక్టు వల్ల నష్టపోయే బాధితులను, నిర్వాసితులను పిలవకుండా పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పరిధిలోని మధు పార్క్ ప్రాంతంలో ఎంతో మంది మాజీ సైనికులు నివసిస్తున్నారని, ఈనెల 28న హిమా యత్‌సాగర్ సమీపంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన సమావేశంలోకి అసలైన బాధితులను అనుమతిం చకపోవడం దారుణమన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ కార్పొరేషన్‌కు రూ.750 కోట్ల అంచనా వ్యయం చూపించి చివరకు రూ.3 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అంచనాలు చెబుతూ స్పష్టమైన డీపీఆర్, బడ్జెట్ కేటాయింపులు చూపకుండా ముందు కు వెళ్తోందని ఆరోపించారు. నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ఇళ్లు కూల్చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. బాధితులతో ప్రజాదర్బార్ నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.
మాక్ పార్లమెంట్‌తో ప్రజాస్వామ్యం అపహాస్యం
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తూ, మాక్ పార్లమెంట్ పేరిట ప్రజాస్వామ్య దేవాలయాలను అపాహాస్యం చేస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. విద్యార్థులు, యువత లో భవిష్యత్తు నాయకత్వ లక్షణాలను పెం పొందించేందుకు విద్యాసంస్థల్లో మాక్ అసెంబ్లీలు, పార్లమెంట్‌లు నిర్వహించడం సంప్రదా యమని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. గతం లో సుప్రీంకోర్టును అవహేళన చేస్తూ రిటైర్డ్ జడ్జీలతో పిటిషన్లు తీసుకుంటూ ‘కంగారూ కోర్టు’ తరహా విచారణలు నడిపిన చరిత్ర కాం గ్రెస్‌దని మండిపడ్డారు.
వారణాసి బీజేపీ సీటు కాదు
ఇటీవల పలు రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్‌తో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓట మి పాలైందని రాంచందర్‌రావు విమర్శించా రు. 23 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాలు గెలుచుకుందని, బ్యాలెట్ పేపర్లలోనూ బీజేపీదే పైచేయి అని నిరూపితమైం దని పేర్కొన్నారు. వారణాసి మొదటి నుంచి బీజేపీ సిట్టింగ్ సీటు కాదని, 2014 కంటే ముందు నుంచి మొన్నటి వరకు సమాజ్‌వాదీ పార్టీయే అక్కడ ప్రాతినిధ్యం వహించిందని స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోనూ గతంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన స్థానమేనని వివరించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోళి స్వయంగా తమ రాష్ట్రంలో సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని రెండు రోజుల క్రితమే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
వారి సొంత మంత్రే ప్రక్రియను సమర్థిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ వీఎంలతో గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇండీ కూటమి ర్యాలీ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించలేదని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను రాంచందర్‌రావు కొట్టిపారేశారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక రైళ్ల బుకింగ్ నెలల ముందుగానే జరగాలని, నిర్ణీత రుసుము చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌ది రక్తచరిత్ర
వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమై, చీకట్లో తలుపులు మూ సి రాష్ట్రాన్ని విభజించిన రక్తచరిత్ర కాంగ్రెస్‌దని రాంచందర్‌రావు విమర్శించారు. తెలం గాణ ప్రజలకు తాము క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న మంత్రి పొన్నం.. అసలు తెలంగాణకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ నేతలేనని స్పష్టం చేశారు. గతంలో అన్యాయంగా ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు చేసిన మంత్రి పొన్నం.. కనీసం పది మంది అర్హులైన ఓటర్ల ఆధారాలు చూపమంటే సమాధానం చెప్పలేక పారిపోయారని మండిపడ్డారు.
ఆరు దశాబ్దాల పాలనలో బీసీ కమిషన్ నివేదికలను అటకెక్కించి, ఇప్పుడు బీసీ గణన పేరిట కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆక్షేపించారు. రాష్ర్టంలో తీవ్ర కరువు, తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్ లో జనం ట్యాంకర్ల వెంట పడుతుంటే సీఎం, మంత్రులు మాత్రం రాహుల్‌గాంధీ మెప్పు కోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నవంబరు 2న అమిత్‌షా సమక్షంలో నిర్వహించే ‘లోక్తంత్ర బచా వో’ పాదయాత్రతో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనకు అంతం పలుకుతామని రాంచందర్‌రావు హెచ్చరించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హన్మంతరావుతో పాటు పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రాంచందర్‌రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
వచ్చే నెల 2న అమిత్‌షా సభ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారని రాంచందర్‌రావు వెల్లడించారు. పర్యటనలో భాగంగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లో ని నిజాం కాలేజీకి ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి మొ జాంజాహి మార్కెట్ చౌరస్తా వరకు భారీ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఏర్పాటు చేసే బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య ప్రసంగం చే స్తారని వివరించారు.
ఈ పాదయాత్రతో పాటు అన్ని నియోజకవర్గాల పరిధిలో మేధావుల సదస్సులు, వివిధ నివర్సిటీల విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల్లో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు 500 పాదయాత్రలను చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను రూ పొందిస్తున్నట్లు రాంచందర్‌రావు స్పష్టం చేశారు.