విశ్వనగరానికి 85వేల కోట్లు

31-10-2026 | 05:20am
  1. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక   
  2. మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త రూపు
  3. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ
  4. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు భాగస్వాములు కావాలి 
  5. ‘నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు దేశంలో అత్యంత వేగంగా పురోగతి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు.

నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పాత్ర అత్యంత కీలకమని, ఈ రంగంలో ఉన్నవారిని కేవలం వ్యాపారవేత్తలుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన ‘నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌కు అనేక అనుకూలతలు ఉన్నాయని, మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగరంలో స్థిరపడేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఓ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగర అభివృద్ధికి బలమైన పునాదులుగా నిలిచాయన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం సుమారు రూ.84,790 కోట్లతో భారీ కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. ఇందులో ఇప్పటికే సుమారు రూ.55 వేల కోట్ల పనులకు సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ చేపట్టడంతో పాటు పలు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.  

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, మెట్రో రైలు తదితర మౌలిక సదుపాయాల కోసం రూ.52,706 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు రూ.15,849 కోట్లు కేటాయించి పనులు ముందుకు తీసుకెళ్తున్నట్టు భట్టి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.4 వేల కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,500 కోట్లు, సైబరాబాద్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,163 కోట్లు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రహదారుల అభివృద్ధికి రూ.500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.

మూసీ పునరుజ్జీవనంతో కొత్త రూపు 

మూసీ నదిని మురికి కూపం నుంచి స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే నదిగా మార్చి హైదరాబాద్‌కు గొప్ప ఆస్తిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని భట్టి విక్రమార్క తెలిపారు. తొలి దశలో రూ.7,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పారు. మూసీలోకి మురుగునీరు చేరకుండా నగరంలోని 21 ప్రధాన నాలాల వద్ద శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్న ట్లు భట్టి వెల్లడించారు. ఎస్టీపీల సంఖ్యను భవిష్యత్తులో 38కు పెంచే ఆలోచన ఉందన్నారు. మూసీ నది భవిష్యత్తులో హైదరాబాద్‌కు అతిపెద్ద ఆభరణంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. నగరాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పరిశ్రమలను బయటకు తరలించడం ద్వారా నగరంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా మన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సబ్సిడీతో కూడిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి  రూ.93 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.  

అవసరమైన నైపుణ్య మానవ వనరులు 

రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని భట్టి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని భట్టి వివరించారు. నగరంలో లగ్జరీ గృహాలతో పాటు పేద, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించే అంశంపై కూడా దృష్టి సారించాలని పరిశ్రమల వర్గాలకు సూచించారు.     

ఘనంగా ప్రాపర్టీ షో ప్రారంభం 

500కు పైగా ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలు, అనుబంధ పరిశ్రమల భాగస్వామ్యంతో 16వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు, ఇతర ప్రముఖులతో కలిసి ప్రాపర్టీ షోను ప్రారంభించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన నవంబర్ 1 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది.

ప్రవేశం ఉచితం. తొలిరోజే ప్రముఖ డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య, ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టులను సందర్శకులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలో వివిధ బడ్జెట్లకు అనుగుణంగా అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య ఆస్తులను అందుబాటులో ఉంచారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాలు, ఇతర ఆర్థిక సదుపాయాలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి కొనుగోలుదారులకు వివిధ ప్రాజెక్టులను నేరుగా పరిశీలించే అవకాశాన్ని సైతం ప్రాపర్టీ షో కల్పిస్తోంది. 

ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ రంగాలు : నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి

నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగంలో కీలక వేదికగా నిలుస్తోందన్నారు. కొనుగోలుదారులు, డెవలపర్లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రాపర్టీ షో ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. సెక్రటరీ జనరల్ ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు, ఇప్పటికే ఉన్న ఇంటి నుంచి మెరుగైన వసతులున్న మరో ఇంటికి మారాలనుకునేవారు, వ్యాపార లేదా పెట్టుబడి అవసరాల కోసం ఆస్తులను కొనుగోలు చేయాలనుకునేవారికి తగిన ప్రాపర్టీలు ఒకేచోట అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డామెర కాళీప్రసాద్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి సంవత్సరం ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమంగా ప్రాపర్టీ షో మారిందన్నారు. స్పాన్సర్లు, భాగస్వాములు ప్రదర్శనపై ఉంచిన నమ్మకమే దీని విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కె.గోపాలకష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ మార్కెట్‌లో మారుతున్న అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా డెవలపర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని తెలిపారు.

ఇది నగరం దీర్ఘకాలిక అభివృద్ధిపై రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంద న్నారు. నారెడ్కో తెలంగాణ కోశాధికారి కొండల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రముఖ బ్యాంకులు ఈ ప్రదర్శనలో పాల్గొని సేవలందించడం వల్ల కొనుగోలుదారులకు గృహ రుణాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని, రుణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని చెప్పారు.

ప్రాపర్టీ షో స్పాన్సర్లు

పవర్డ్ బై స్పాన్సర్లు : వాసవి గ్రూప్, గంగోత్రి ఇన్ఫ్రా ఎడ్జ్, జయభేరి గ్రూప్, అన్విత గ్రూప్.

ప్లాటినమ్ స్పాన్సర్లు : రాజాపుష్ప ప్రాపర్టీస్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, రాధే కన్స్ట్రక్షన్స్, రామ్‌కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్, ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ, మైరాన్ హోమ్స్.

డైమండ్ స్పాన్సర్లు : నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, వెర్టెక్స్ హోమ్స్, వజ్రా నిర్మాణ్, కాన్సెప్ట్ అంబియెన్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, వజ్ర ఇన్ఫ్రా.

గోల్డ్ స్పాన్సర్లు: గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, ఎలిగాన్స్ గ్రూప్, ప్రణీత డెవలపర్స్, విజన్ ఇన్ఫ్రా, ఎస్‌ఆర్‌ఆర్ ఇన్ఫ్రా, మహారాజ స్పేసెస్

సిల్వర్ స్పాన్సర్లు: అర్బన్రైజ్ లైఫ్‌స్టైల్, మహిధర ప్రాజెక్ట్స్, ఇఏపీఎల్ గ్రూప్, శ్రీముఖ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆస్పురై స్పేసెస్, అభినందన ఇన్ఫ్రా.

బ్రాంజ్ స్పాన్సర్లు: ఈశాన్య ఇన్ఫ్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్నో పెయింట్స్, టఫ్ స్టోన్స్ 

మరిన్ని వార్తలు