బియ్యం అక్రమాలను సహించబోం

31-10-2026 | 05:00am
  1. ధరలు పెంచినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు 
  2. మిల్లర్లు, వ్యాపారులకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్
  3. బీపీటీ రైస్ కిలో రూ. 66కు మించొద్దు 
  4. ధరలు స్థిరపడే వరకు ముమ్మర తనిఖీలు 

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) హెచ్చరించారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా సంపాదించాలనుకునే వాళ్లను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన తేల్చిచెప్పారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేట కుందన్ బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో శుక్రవారం సమీక్షించారు. టోకు, చిల్లర వ్యాపారులు, రైస్ మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చల వివరాలను తెలుసుకున్నారు. అక్రమాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక చర్యలు, తనిఖీల పురోగతిని మంత్రికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఇతర ఉన్నతాధికారులు రివ్యూలో పాల్గొన్నారు.

సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి  ఉత్తమ్ తెలిపారు. ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం విషయంలో నాణ్యత, ఉత్పత్తి వ్యయాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని ధరపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ‘వినియోగదారులపై భారం మోపుతూ అధిక లాభాలు సంపాదించడాన్ని ప్రభుత్వం సహించదు. మార్కెట్లో ధరలు స్థిరపడే వరకు తనిఖీలు, అక్రమాల నిరోధక చర్యలు కొనసాగుతాయి’ అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

ముమ్మర దాడులు.. ఇప్పటికే 12 కేసులు..

అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు తదితర అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే బియ్యం వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఐదు శాఖల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నామని.. పౌర సరఫరాలు, పోలీసు, జీఎస్టీ, తూనికలు-కొలతల శాఖలతోపాటు సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్  విభాగాలు ఈ చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో టోకు, చిల్లర బియ్యం మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. బేగంబజార్, నాంపల్లి, మహరాజ్‌గంజ్ సహా ప్రధాన టోకు వ్యాపార కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమాలను గుర్తించడం, అధిక ధరలను అరికట్టడం, వినియోగదారులకు ఊరట కల్పించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ చర్యలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. కొరత వస్తుందనే ఆందోళనతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లుల్లోనే బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని వివరించారు. నిబంధనలకు తగ్గట్టు వ్యాపారం చేసే వ్యాపారులు, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని ఉత్తమ్ తెలిపారు. అదే సమయంలో అక్రమ వ్యాపార పద్ధతులతో ప్రజలపై భారం మోపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు