జీఎస్ఎల్వీ ఎఫ్-18 సక్సెస్
- కక్షలోకి ఎన్వీఎస్ ఉపగ్రహం
- నావిక్ సేవలకు ఊతం
- హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ నారాయణన్
- 13 ఏళ్లపాటు సేవలందించనున్న ఉపగ్రహం
శ్రీహరికోట, అక్టోబర్ 30 (విజయక్రాంతి): భారత అంతరిక్ష సంస్థ ఇస్రో(ISRO) మరో కీలక ప్రయోగంలో విజయఢంకా మోగించింది. జీఎస్ఎల్వీఎఫ్-18(GSLV F-18) రాకెట్ ద్వారా ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ కేంద్రం నుంచి రాత్రి 11.51 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహంలోని నావిగేషన్ వ్యవస్థ నావిక్ 13 ఏళ్లపాటు నిరంతరాయ సేవలను అందించనుంది. దీంతో దేశ నావిగేషన్ బలోపేతం, సముద్రయాన నావిగేషన్, సరిహద్దు భద్రత, పౌరసేవలు, వాతావరణం తదితరాలపై మరింత మెరుగ్గా దృష్టి సారించనున్నారు. ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్వీఎస్.03 ప్రత్యేకతలు..
ఈ ఉపగ్రహం 2,232 కిలోల బరువు కలిగి ఉండగా 13 సంవత్సరాలపాటు సేవలందించనుంది. కచ్చితమైన లొకేషన్ సమాచారం అందించడం, విపత్తుల నిర్వహణ, రైల్వే రవాణా వ్యవస్థ, రక్షణ రంగానికి సంబంధించిన భద్రతా అవసరాల్లో ఈ ఉపగ్రహ సేవలు కీలకం కానున్నాయి. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత్ ఈ నావిగేషన్ వ్యవస్థను సొంతంగా అభివృద్ధి చేసింది.
దీంతో ఇతర దేశాల శాటిలైట్ జీపీఎస్లపై ఆధారపడటాన్ని తగ్గనుంది. అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని దేశీయ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇందులోని రూబిడియం అటామిక్ క్లాక్‌ను అహ్మదాబాద్‌లోని ఇస్రో కేంద్రం తయారు చేసింది. దీంతో ఎల్ ఎస్ -బ్యాండ్ సిగ్నల్స్‌కు అదనంగా ఎల్ నావిగేషన్ సిగ్నల్స్ ద్వారా 1,500 కి.మీ. సమాచారాన్ని అత్యంత ఖచ్చితంగా సేకరించి అందించనుంది. మొత్తం ఉపగ్రహ వ్యవస్థలో ఈ అటామిక్ క్లాకే కీలకంగా నిలవనుంది.