భాగ్యనగరంలో భారీ వర్షం
- అత్యధికంగా బహదూర్పురాలో 8.5 సెంటీమీటర్లు
- మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్
- రంగంలోకి డీఆర్‌ఎఫ్ బృందాలు
- మరో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్(Hyderabad) మహా నగరం శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా కురిసిన భారీ వర్షం(Heavy Rain)తో స్థంభించిపోయింది. దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పాతబస్తీ అత్యధికంగా బహదూర్పురాలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైటెక్ సిటీ మాదాపూర్‌లో 7.1 సెం.మీ, కీసరలో 6.7, షేక్‌పేటలో 6.4, చార్మినార్‌లో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. మణికొండ, రాయదుర్గం, తుర్కయంజాల్, మన్నెగూడ, కాప్రా, నాగారం, టోలిచౌకి, కార్వాన్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, యూసుఫ్‌గూడా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
కుత్బుల్లాపూర్ చౌరస్తా నుంచి సూరారం వరకు, షాపూర్ నుంచి గాజులరామారం వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్, ఐకియా షోరూం మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వర్ష తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని అధికారులు అలర్ట్‌చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడం, డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల వద్ద నిలిచి పోయిన చెత్తను తొలగించి నీటి ప్రవాహాన్ని సులభతరం చేయడం, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేపట్టారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు.
3 వరకు వర్షాలు
రాష్ట్రంలో మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, గంటకు 30 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.