పోక్సో, బాల్య వివాహాల నిషేధ చట్టాలపై అవగాహన

24-10-2026 | 09:57pm

డీఎల్ఎస్ఏ కార్యదర్శి అనూష

లింగపూర్,(విజయక్రాంతి): ప్రజలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.అనూష(DLSA Secretary Anusha) సూచించారు. లింగాపూర్‌ మండలం జాముల్దారి గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పోక్సో చట్టం(POCSO), బాల్య వివాహాల(child marriage laws) నిషేధ చట్టం, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు. గ్రామాల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు చదువుకున్న యువతీ యువకులు, ఆసక్తి కలిగిన వ్యక్తులు పారా లీగల్‌ వాలంటీర్లుగా ముందుకు రావాలని కోరారు.

అనంతరం న్యాయవాదులు, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధి అంజని దేవి, న్యాయవాది సూర్యనారాయణ వివిధ చట్టాలు, వాటి అమలు విధానం, బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంస్థను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు