లోక్ అదాలత్‌తో పేద, బలహీన వర్గాలకు సత్వర న్యాయం
కోర్టుల చుట్టూ తిరిగి సమయం, ధనం వృథా చేసుకోవద్దు
తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి గౌస్ పాషా
తుంగతుర్తి,(విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాలకు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జూనియర్ సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా పేర్కొన్నారు. శనివారం తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలకు న్యాయం అందించడంతో పాటు, ఎలాంటి అధిక ఖర్చులు లేకుండా వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించి సమాజంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడమే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39-ఏ స్ఫూర్తితో న్యాయం అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో లోక్ అదాలత్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 1985లో లోక్ అదాలత్ వ్యవస్థకు ప్రాధాన్యం ఏర్పడిందని పేర్కొన్నారు.క్షణికావేశంలో చిన్నచిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారి సొంత అన్నదమ్ములు సైతం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.
కొట్టుకోవడం, గాయపరచుకోవడం, హత్యలకు దారితీసే ఘటనలు చోటుచేసుకోకుండా వివాదాలను ప్రారంభ దశలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకోకుండా, పరస్పర అంగీకారంతో వివాదాలకు పరిష్కారం పొందేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక అని తెలిపారు. ఇరుపక్షాల సమ్మతితో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కుటుంబాలు, వ్యక్తుల మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పలకవచ్చని పేర్కొన్నారు.