పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

06-10-2026 | 07:52pm

పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): ​రెండేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి ​నిర్దేశిత గడువులోగా చార్జ్ షీట్లు దాఖలు చేయాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం(CP Gaush Alam) పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

​కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌‌లో ఉన్న కేసుల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని పోలీస్ కమీషనర్  గౌష్ ఆలం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల పరిష్కార  వివరాలను క్షుణ్ణంగా సమీక్షించారు.

రెండేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉండి, నిందితులు పట్టుబడని కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. పాత కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలని సూచించారు. కేసు స్వభావాన్ని బట్టి నిర్దేశిత చట్టబద్ధమైన గడువు లో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేయాలి. దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన ప్రివెంటివ్ డిటెన్షన్ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ​ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో కమీషనరేట్  అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి,  సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు