రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది
జాకోరా ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీటి కొరతకు డోకా ఉండదు
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం(Farmers welfare) కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జాకోర ఎత్తిపోతల పథకం సాగునీటి పంపులను బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ... రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
రైతులకు సాగునీటి కొరత లేకుండా చేయడం ద్వారా పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు.జాకోర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, సాగునీటికి ఎల్లాకాలం డోకా ఉండదని ఆయన పేర్కొన్నారు. సాగునీరు అందితే రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడి, వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని అన్నారు.రైతులకు అవసరమైన సమయంలో నీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, రైతు పొలంలో పంట పండితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, సాగునీరు, వ్యవసాయ మౌలిక వసతులు, రైతులకు అవసరమైన సహాయ సహకారాల విషయంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.