DRI కీలక ఆపరేషన్.. 740 కిలోల గంజాయి స్వాధీనం
1985 నిబంధనల కింద 13 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence) సుమారు 740 కిలోల గంజాయి(Ganja), చరస్‌ను స్వాధీనం చేసుకుని, 13 మందిని అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 709.6 కిలోల గంజాయి, 24.5 కిలోల అత్యుత్తమ నాణ్యత గల హైడ్రోపోనిక్ గంజాయి, 5 కిలోల చరస్ ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 8న నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఒక ఆపరేషన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలో విశాఖపట్నం నుండి వస్తున్న రెండు ట్రక్కులను DRI అధికారులు అడ్డుకున్నారు. ఆ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ట్రక్కుల లోడింగ్ భాగంలో ఉంచిన 10 బస్తాలలో దాచి ఉంచిన 61 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 375.95 కిలోల గంజాయిని, ఆ రెండు ట్రక్కులతో సహా స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టకు డీఆర్ఐ ముమ్మర చర్యలు చేపట్టింది. డీఆర్ఐ దేశవ్యాప్తంగా 15 రోజుల్లో 8 కీలక ఆపరేషన్లు నిర్వహించింది. మరో మూడు ఆపరేషన్లలో హైదరాబాద్, బెంగళూరు, విమానాశ్రయాల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది.