రేపటి నుంచి రైస్ మిల్లింగ్ బంద్
డిమాండ్ల పరిష్కారం కోసం మిల్లర్ల సంఘం నిర్ణయం
బోధన్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District) వ్యాప్తంగా సెప్టెంబర్ 10 నుంచి రైస్ మిల్లింగ్ బంద్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి రైస్ మిల్లర్స్ అసోసియేషన్(Rice Millers Association) నాయకులు దయానంద్ గుప్తా, కపర్తి శ్రావణ్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ నగరంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించి మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అవుట్ టర్న్ రేషియో (ఓటీఆర్)లో టెస్ట్ మిల్లింగ్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల వల్ల రైస్ మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మిల్లర్లకు ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు చెల్లించాలని కోరారు. ధాన్యం మిల్లులకు కేటాయించిన అనంతరం ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా, ధాన్యం ఇచ్చిన మూడు నెలల్లోపు బియ్యాన్ని తిరిగి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం నిల్వలు ఎక్కువకాలం మిల్లుల్లో ఉండటంతో నిర్వహణ భారం పెరుగుతోందని పేర్కొన్నారు.
మిల్లింగ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న చార్జీలు సరిపోవడం లేదని, క్వింటాల్‌కు రూ.100 చొప్పున మిల్లింగ్ చార్జీలు పెంచాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, మిల్లర్లకు న్యాయం చేయాలని వారు కోరారు. డిమాండ్ల సాధనలో భాగంగానే రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా మిల్లింగ్ బంద్ చేపడుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు మిల్లర్లు పాల్గొన్నారు.