దొంగ దొరికేనా..?

09-09-2026 | 11:21pm

దొంగను పట్టుకోవడంలో నిర్లక్ష్యం ఎవరిది..?

వరుస చోరీలతో ప్రజల్లో భయం

పోలీసులకు సవాల్‌గా మారిన ఘటనలు

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలో వరుస చోరీలు జరుగుతున్నప్పటికీ నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రజలు, వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాచకొండ చంద్రశేఖర్‌కు చెందిన కిరాణా దుకాణంలో చోరీ(Theft) జరగడంతో మరోసారి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామున దుకాణం తెరిచి వ్యాపారాలు నిర్వహిస్తున్న సమయంలో క్యాష్ కౌంటర్‌లో చిల్లర డబ్బులు కనిపించకపోవడంతో పాటు వెంటిలేటర్ కిటికీ తెరిచి ఉండటాన్ని వ్యాపారి రాచకొండ స్వప్నిల్(Merchant Rachakonda Swapnil) గుర్తించారు. దీంతో దుకాణంలో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్సై సర్తాజ్ పాషా(SI Sartaj Pasha) సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించి వ్యాపారి నుంచి వివరాలు సేకరించారు. క్యాష్ కౌంటర్‌లో ఉంచిన సుమారు రూ.60 వేల నగదును దొంగలు అపహరించినట్లు వ్యాపారి స్వప్నిల్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల కోసం గాలింపు చేపట్టగా గోల్కొండ సమీపంలోకి వెళ్లిన అనంతరం డాగ్ ఆగిపోయినట్లు సమాచారం. క్లూస్ టీమ్ సిబ్బంది దుకాణంలో వేలిముద్రలను సేకరించారు.

వరుస చోరీలతో భయం

బెజ్జూర్ మండల కేంద్రంలో గత ఏడాది కాలంలో దీక్షిత ఫెర్టిలైజర్, నరేష్ జువెలర్స్, రామయ్య సెల్ పాయింట్‌తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ సురేందర్‌కు చెందిన ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు పలు ఘటనల్లో నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రజలు, వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

పెట్రోలింగ్‌పై ఆరోపణలు

మండల కేంద్రంలో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ కనిపించడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితిని దొంగలు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస చోరీల నేపథ్యంలో రాత్రి గస్తీని మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలు

మండల కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాల నియంత్రణలో అవి ఉపయోగపడటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోతే వాటి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలోని ప్రతి ప్రధాన గల్లీ, వ్యాపార ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచి వరుస చోరీలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు