సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- సింగరేణి కి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి రూ.59 వేల కోట్లు చెల్లించాలి
- ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్
- జిఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
భూపాలపల్లి,నవంబర్ 04 (విజయ క్రాంతి) : సింగరేణి కార్మికుల(Singareni worker) పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, సింగరేణికి ప్రభుత్వం చెల్లించవలసిన 59 వేల కోట్ల బకాయిని వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిఎం కార్యాలయం ముట్టడించారు.
ఈ సందర్భంగా నిరసన తెలిపి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిఎం రాజేశ్వర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ గతంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. గతంలో అపాయింట్మెంట్ పొందిన డిపెండెంట్ అభ్యర్థులకు నెల రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాల ఇప్పిస్తామని అనుమతుల పేరుతో జాప్యం చేస్తుందన్నారు.
మరోవైపు కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేస్తానని పలుమార్లు హామీలు ఇచ్చిన ఇప్పటికి అమలు చేయడం లేదని అన్నారు. రక్షణ ఉత్పత్తికి సంబంధించిన బూట్లు, హెల్మెట్లు, బీట్లు డ్రిల్లు రాడ్లు, హెచ్ డి యంత్రాలు సంబంధించిన స్పేర్స్ అత్యవసర పరికరాల కొరత కారణంగా కార్మికుల భద్రత, ఉత్పత్తి పై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించవలసిన 59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ప్రతినెల మెడికల్ బోర్డు నిర్వహించి వైద్య పరీక్షల్లో అనర్హులను నిర్ధారించబడిన అర్హులైన కార్మికులకు నిబంధనల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.మారుపేరుల సమస్య, డిపెండెంట్ ఉద్యోగాలు, సొంతింటి పథకం, రక్షణ పరికరాలు సింగరేణి కి రావలసిన బకాయి ఇలాంటి అనేక సమస్యలపై ను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని లేదంటే సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శిలు గురుజేపల్లి సుధాకర్ రెడ్డి, ఎండి ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, సింగ్ సార్, రవికుమార్, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, తాళ్ల పోశం, ఫిట్ కమిటీ నాయకులు ఎండి కరిముల్లా,పి శ్రీనివాస్, కృష్ణారెడ్డి ఎల్ శంకర్, శ్రీనివాస్ దారపోశయ్య, సాంబయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.