వైన్స్ షాపుల్లో అదనపు వసూళ్లు..

04-11-2026 | 09:43pm

వినియోగదారుల సంఘం ఏర్పాటుకు సన్నాహాలు!

కోనరావుపేట నవంబర్ 4 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలోని(Konaraopeta Mandal) వైన్స్ షాపుల్లో మద్యం బాటిళ్లపై నిర్ణీత ధర కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మద్యం కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో వినియోగదారులంతా సంఘటితమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా మండలంలోని ప్రతి గ్రామం నుంచి సభ్యులను ఎంపిక చేసి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా మద్యం వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర మండలాల సభ్యులను కలుపుకొని విస్తృతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.సామాన్యులపై అదనపు భారం

రోజువారీ కూలీలు, రైతులు, వృద్ధులు సైతం మద్యం కొనుగోలు సమయంలో అదనంగా డబ్బులు చెల్లించాల్సి రావడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ అదనపు వసూళ్ల ద్వారా కోనరావుపేట మండలంలో నెలకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోందనే ప్రచారం స్థానికంగా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.

ఎక్సైజ్ శాఖ స్పందించేదెప్పుడు?

వైన్స్ షాపుల్లో అదనపు వసూళ్లపై గతంలోనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన స్పందన లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వైన్స్ యజమానులు, అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రోత్సాహంతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందనే ఆరోపణలు సైతం స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారికంగా ధ్రువీకరణ లేదు.

ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి వైన్స్ షాపుల్లో ధరల పట్టికలను తనిఖీ చేయాలని, నిర్ణీత ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.వినియోగదారుల సంఘం ఏర్పాటు కార్యరూపం దాల్చితే మండలంలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు